అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి.
తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు .. పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అన్ని ప్రదేశాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తూ ఉండాలని తెలిపారు.ఎగువన కురుస్తున్న అధిక వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది క్రమేపిపెరుగుతుందని,పరీవాహక ప్రాంతాల్లోని ముంపు ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వరద నీటి ఉదృతితో రాకపోకలకు ఆటంకాలు కలుగుతున్న రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి అట్టి ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందన్నారు.అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి నీటితో నిండటం వలన,వాహనాల టైర్లు జారి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.విపత్తుల కాలంలో ప్రజలకు సేవలందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.ఆపదలో ఉన్నవారు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు.ప్రజాహితార్థం పోలీసు వారు చేపట్టే చర్యలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.