రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడదాం
రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడదాం: ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ హాలు నందు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడానికి పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరం ద్వారా 130 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా,నిత్యం గుర్తు చేసుకోవడానికి జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
పోలీసులు చేపడుతున్న ఇట్టి కార్యక్రమాలకు జిల్లా ప్రజలు,యువత నుండి అనూహ్య స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. రక్తదానం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,గర్భిణీ స్త్రీలకు,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి ప్రాణాలను నిలబెట్టడంలో మన వంతు బాధ్యత నిర్వహించొచ్చని అన్నారు.
కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రక్తదానం చేసిన పోలీసు అధికారులు సిబ్బంది మరియు స్థానికులకు పండ్లను,బిస్కెట్ ప్యాకెట్లను పంచారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ గారితో పాటు సిఐలు,ఎస్ఐలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్,జూలూరుపాడు సీఐ ఇంద్రాసేనారెడ్డి,ఆర్ఐలు సుధాకర్, నరసింహారావు,కృష్ణారావు మరియు ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.