తల్లి పాలు బిడ్డకు అవసరం
తల్లి పాలు బిడ్డకు అవసరం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ బృందం సభ్యులు గిరిజన గ్రామాలలో రక్తహీనత తక్కువ ఉన్న గర్భిణీ మహిళలు, చిన్నారుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం చాలా సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
లక్ష్మీదేవి పల్లి మండలం లోని గట్టు మల్ల గ్రామంలో తల్లి పాల ప్రాముఖ్యత, తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో అలాగే చిన్నారులకు రక్తహీనత తక్కువ ఉన్నవారికి అందించవలసిన న్యూట్రిషన్ ఫుడ్ గురించి ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మారుమూల ఆదివాసి గిరిజన 8 మండలాలలో ఎన్ ఐ ఎన్, హెచ్ ఓ డి డాక్టర్ సైవల్య పెర్నండేజ్, శ్రీదేవి న్యూట్రిషన్ కోఆర్డినేటర్ సమన్వయముతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలుపుతూ మహిళను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంట లో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు ( ముర్రుపాలు ) బిడ్డకు అమృతం లాంటిదని,తల్లి పాలు సంపూర్ణ ఆహారం అని అన్నారు. వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయనీ, అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని అన్నారు.
బిడ్డకు మొదటి 6 నెలలు తల్లి పాలే సంపూర్ణ ఆహారమన్నారు. 6 నెలలు దాటిన తరువాత తల్లి పాలతోపాటు అనుబంధ ఆహారం కూడా ఇస్తారని తెలిపారు. తల్లిపాలు శిశువును న్యుమోనియా, అతిసార వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడతాయని ఆయన అన్నారు. పిల్లల మేధస్సు ను మెరుగుపరచడంలో తల్లి పాలు సహాయపడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణి స్త్రీ లకు, బాలింతలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారని ఆయన అన్నారు.
గర్భిణీలకు, చిన్నారులకు అందించవలసిన ఆహారంతో పాటు చిన్నారులకు వచ్చే సికిల్ సెల్ అనేమియా వ్యాధి గురించి కూడా గిరిజనులకు అవగాహన కల్పించాలని బృందం సభ్యులకు తెలిపారు. అనంతరం సేంద్రీయ ఎరువులతో ఇంటి ఆవరణలో వివిధ రకాల పండ్ల తోటలు మరియు ఆకుకూరలు పండిస్తున్న ఇంటి యజమానులకు అభినందించి, ఇవేకాక పంట పొలాలలో చేపలు చెరువు లాంటి నిర్మాణాలు తక్కువ పెట్టుబడి తో ఏర్పాటు చేసుకొని అధిక లాభాలు పొందాలని వారికి సూచించారు.