ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ జితేష్
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ జితేష్
చర్ల,దుమ్ముగూడెం మండలాల్లో పర్యటించిన కలెక్టర్.
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలోని ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. చర్ల మండలంలో దండుపేట, రాళ్ల గూడెం గ్రామాల్లో పర్యటించి ఇరిగేషన్, రెవిన్యూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది వరదలు తాకిడి అధికంగా ఉంటున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ముంపు ప్రాంత గ్రామాలను గతంలో మాదిరిగా గుర్తించి వారికి సంబంధించిన పునరావాస కేంద్రాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ప్రధానంగా ఏడు ముంపు మండలాల గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గతంలో ఎక్కడెక్కడ పునరావాస క్రేంద్రాలను ఏర్పాటు చేశారో అదే మాదిరిగా ఇప్పుడు కూడా గుర్తించాలన్నారు. అదేవిధంగా ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల దృష్టి సారించాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలని,వరదల సమయంలో ఉద్యోగులు ఎవరు అనుమతి లేకుండా ముందస్తు సెలవులు తీసుకోవద్దని తెలిపారు. గతంలో మాదిరిగానే సమన్వయంతో సమష్టిగా పనిచేసి వరదలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం ఉండాలని అన్నారు.
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అందరి లక్ష్యం..
ముంపు గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే దగ్గర నుంచి వారికి కల్పించాల్సిన మౌలిక వసతుల వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ముఖ్యమన్నారు. వరదల సమయంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అందరి లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఇప్పటినుంచే తగు ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా చర్ల మండలంలో దేవరపల్లి, దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బడి బయట ఉన్న పిల్లలను త్వరితగతిన గుర్తించి బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్కారు కృషి చేస్తుందని, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ జి ఎం , భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు,ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజనీర్ రాంప్రసాద్, డి ఈ .జే తిరుపతి, అసిస్టెంట్ ఇంజనీర్ ఉపేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాము,చర్ల మరియు దుమ్ముగూడెం తాసిల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాధికారులుతదితరులు పాల్గొన్నారు.