ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదు పై ప్రత్యేక దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ కు వచ్చిన ఆయనకు మొదట జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఎన్నికల విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఈఓ మాట్లాడుతూ జిల్లాలో నూరు శాతం ఓటరు నమోదు కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. దివ్యాంగులు,ట్రాంజెండర్లను గుర్తించి నేరుగా అధికారులే వెళ్లి ఓటు కోసం దరఖాస్తుకు అవగాహన కల్పించాలన్నారు. అలాంటి దరఖాస్తులను ఈనెల 25 లోపు పరిష్కరించుకోవాలని అధికారులను ఆదేశించారు. బిఎల్వోలు ప్రతీ రికార్డును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు సూచనలను తీసుకోవాలని చెప్పారు. బిఎల్వో వ్యవస్థను మరింత ప్రతిష్టపరిచేలా చూడాలని తాసిల్దార్లకు సూచించారు.
ఎమ్మెల్సీ ఓటర్ నమోదును మరింత చురుగ్గా నిర్వహించాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇతర ప్రాంతాల్లో ఉంటే పరిశీలన చేసి వారికి అవగాహన కల్పించాలని సీఈవో చెప్పారు. ఓటరు నమోదుతో పాటు సవరణల్లో భాగంగా మార్పులు, చేర్పులు, ఓటరు గుర్తింపు కార్డుల జారీ వంటివి ఎప్పటికప్పుడు చేపడుతూ ప్రజలకు సహకరించాలని అధికారులకు ఆదేశించారు. ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఓటరు నమోదు ప్రక్రియ, సవరణల వంటి వాటిపై ఎప్పటికప్పుడు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.