మహిళల కుటుంబాలకు భరోసా ఇవ్వాలి
మహిళల కుటుంబాలకు భరోసా ఇవ్వాలి: కలెక్టర్ జితేష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీనిధి రుణాలకు భీమ మరియు ప్రమాద భీమా కల్పించడం ద్వారా మహిళలకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని సీసీలు, ఏపీఎంలు మరియు డీపీఎం లకు శ్రీనిధి రుణాల పై ప్రభుత్వం కల్పిస్తున్న జీవిత బీమా మరియు ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల దినప కలెక్టర్ విద్యాచందనతో కలిసి పాల్గొన్నారు. ముందుగా శ్రీనిధి జోనల్ మేనేజర్ పి శ్రీనివాసరావు శ్రీనిధి రుణాలపై బీమా నమోదు చేసుకోవాలి, భీమా నమోదుకు కావలసిన పత్రాలు, భీమ అనుమతులు తదితర వివరాలను సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ.. శ్రీనిధి మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల పై బీమా సౌకర్యాన్ని కల్పించడం ఉపయోగకరమని అన్నారు.
అదేవిధంగా మహిళా సంఘాల కు కౌజు పిట్టల పెంపకం, బాతుల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం వంటి వాటిపై గ్రూపులుగా విభజించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఐటిఐ విద్యార్థుల ద్వారా కౌజు పిట్టల పెంపకానికి, తేనెటీగల పెంపకానికి అవసరమైన సామాగ్రి తయారు చేయవచ్చు అని తెలిపారు. మహిళా శక్తి యూనిట్లు బాతులు పెంపకం పై దిష్టి సారించాలని దాని ద్వారా అధిక ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు.