ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వ అధికారి
ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వ అధికారి..
క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వ అధికారి, తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలరని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్-2024 అధికారులకు, తెలంగాణ డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థచే ప్రత్యేక ఫౌండేషన్ కోర్స్ లో భాగంగా జిల్లాలో క్షేత్ర పరిశీలనకు వచ్చిన సందర్బంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశ మయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ఉద్యమాల జిల్లా అని, చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లా అని అన్నారు. విప్లవ పోరాటాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక ఖమ్మం జిల్లా అని ఆయన తెలిపారు. షెడ్యూల్ ప్రాంతం, గిరిజన ప్రాంతం కలిగి, సుమారు 27 లక్షల జనాభా కలిగి, భిన్న సంస్కృతుల కలబోత ఖమ్మం జిల్లా అని కలెక్టర్ తెలిపారు.రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇద్దరు కేబినెట్ మంత్రులు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు చైతన్య వంతులని, అభివృద్ధి లో ముందుకు సాగుతున్న జిల్లా అని ఆయన తెలిపారు.
అధికారులు ప్రజలకు సేవలు అందించడానికి ఎంతో అవకాశమున్నదని, నేనేం చేస్తున్నాను, సమాజం నా నుండి ఏం ఆశిస్తున్నది, నా పరిధిలో ఏం చేయగలను అన్నది ఆలోచించాలన్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే విధుల నిర్వహణ చేయగలమని, వృత్తికి న్యాయం చేయగలమని కలెక్టర్ తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దని ఆయన తెలిపారు.
జిల్లాకు వచ్చిన అధికారులు 4 బృందాలుగా జిల్లాలోని తిరుమలాయపాలెం, కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు మండలాల్లో కేటాయించిన గ్రామాల్లో ఈ నెల 21 నుండి 28 వరకు 8 రోజులపాటు పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు, ప్రభుత్వ సంస్థల పనితీరు, ప్రభుత్వ పథకాల లబ్ధి పై పరిశీలిస్తారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, ఎంసిహెచ్ ఆర్ డి ప్రాంతీయ శిక్షణ కేంద్ర మేనేజర్ ఆనంద్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.