అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు విద్యా బోధన
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు విద్యా బోధన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం మంత్రి, ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని, పాలేరు నియోజకవర్గంలో ముందుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
విద్యా, వైద్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. విద్య పట్ల గడిచిన 10 నెలల కాలంలో పేదలకు మంచి చేయాలని ఉద్దేశంతో చేసిన పనిని గమనించాలని అన్నారు. 657 కోట్లు ఖర్చు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన చేశామని అన్నారు. గడిచిన 10 ఏళ్ళలో పెండింగ్ లో ఉన్న 22 వేల టీచర్ల పదోన్నతులు, 34 వేల టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని, మెగా డీఎస్సీ ద్వారా 11 వేల 6 పోస్టులు రికార్డు సమయంలో భర్తీ చేశామని అన్నారు.
పేద ప్రజల పిల్లలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుకునే దిశగా 125 నుంచి 150 కోట్లు ఖర్చు చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నేడు మొదటి విడతలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేస్తున్నామని , భవిష్యత్తులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటువంటి పాఠశాలల నిర్మాణం జరుగుతుందని అన్నారు.
విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణం లో క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ వంటి క్రీడలు ఆడేందుకు వీలుగా అవసరమైన మైదానాలు, కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. సుమారు 2750 నుంచి 3 వేల మంది విద్యార్థులు ఉండే విధంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.