KhammamTelangana

ఇందిర మహిళా శక్తి పథకం

ఇందిర మహిళా శక్తి పథకం

ఇందిర మహిళా శక్తి పథకం క్రింద చేపట్టిన వివిధ యూనిట్లను లబ్దిదారులకు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఇందిర మహిళా శక్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మండల వారిగా మహిళా శక్తి పథకం  కార్యాచరణ చేయాలన్నారు. స్ధానికంగా ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు. బ్యాంకు లింకేజ్ రుణాలతో పచ్చళ్ళ తయారీ, కిరాణా, మొబైల్ టిఫిన్, టైలరింగ్, మెకానిక్, టీ స్టాల్, మెడికల్ షాపు, ఫర్టిలైజర్ షాప్, మీ సేవా, పాడి పశువుల, పౌల్ట్రీ, బోటిక్, లాండ్రీ, బ్యూటీపార్లర్ మొదలగు వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటు కోరకు లబ్దిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. యూనిట్లను నడుపుతూ, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకే గ్రామం, ప్రాంతంలో ఒకే తరహా యూనిట్లు ఒకటి కంటే ఎక్కువ ఏర్పాటు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

యూనిట్ క్యాచ్ మెంట్ ఏరియా లాభదాయకంగా వుండేలా చూడాలని, మండలాల వారిగా గుర్తించి, ఎంపికయిన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, వారం వారం వారిగా గ్రౌండింగ్ యూనిట్ల లక్ష్యం పెట్టుకొని, తదనుగుణంగా కార్యాచరణ చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ నుండి, యూనిట్లు ఆయా వ్యాపారంలో నిలద్రొక్కుకోవడానికి కొంతకాలం పాటు అధికారులు పర్యవేక్షణ చేస్తూ, సహాయ సహకారాలు అందించాలన్నారు. సృజనాత్మక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద ఎంపిక చేసిన లబ్ధిదారులు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, ఈ దిశగా వ్యాపార ధోరణితో ఎదగాలని, ఉత్సాహంగా ఉన్న మహిళా సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని ఆయన అన్నారు.

యూనిట్ తో అభివృద్ధి చెందిన వారి సక్సెస్ స్టోరీస్ ఇతరులకు తెలిసేలా ప్రచారం చేయాలని, దీనితో ఇతరులు ప్రేరణ పొందుతారని కలెక్టర్ తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ మహిళాశక్తి పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మహిళా స్వశక్తి సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద అందించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి లో భాగంగా స్వయం సహాయక మహిళా సభ్యులను ప్రోత్సహిస్తూ, ప్రతి మహిళా సభ్యురాలు నెలకు కనీసం రూ. 15,000 వేల వరకు గ్రామంలోనే సంపాదించే విధంగా అవకాశం కల్పించాలన్నారు. జిల్లాలోని సంఘాలు, గ్రామ సంఘాలను ఏ, బి గ్రేడుల్లో ఉంచాలని, ఇందుకు ప్రతిఒక్కరు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, అదనపు డిఆర్డీవో నూరొద్దీన్, డిపిఎం లు, ఏపీఎం లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *