ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్
ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్
ఖమ్మం: భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రజలు సహాయానికి 24/7 ఫోన్ నెం. 9063211298, టోల్‌ఫ్రీ నెం.1077కు కాల్ చేయాలని ఫోన్ నెం. కు వాట్సాప్ కూడా చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలోని చెరువులు, నీటి వనరులపై నిఘా పెట్టాలని అన్నారు. చెరువులు, వాగుల్లోకి ప్రజలు వెళ్ళకుండా అధికారులు అప్రమత్తం చేయాలన్నారు.
కల్వర్టులు, రోడ్లపై ప్రవాహాలు వున్నచోట రహదారిని మూసివేయాలని, ప్రజలు దాటకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. నీటి ప్రవాహాల వద్ద వలంటీర్లను ఉంచాలన్నారు. బ్యారికేట్స్ అవసరం ఉన్న ప్రతిచోట పెట్టాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం అందుబాటులో ఉంచుకొని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు . బ్యారికేట్స్ అవసరం ఉన్న ప్రతిచోట పెట్టాలన్నారు.ఈ సమీక్ష లో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జెడ్పి సిఇఓ దీక్ష రైనా, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారిణి నాగలక్ష్మి, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.