వ్యాపారులు తూకాలలో మోసాలకు పాలుపడితే చర్యలు
వ్యాపారులు తూకాలలో మోసాలకు పాలుపడితే చర్యలు
వినియోగదారులు వస్తు కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలని జిల్లా తూనికలు, కొలతల అధికారి కె మనోహర్ తెలిపారు. శనివారం టేకులపల్లి మండలంలో జరుగుతున్న వారాంతపు సంతలో కూరగాయలు, మాంసం, పండ్ల దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించి తూకపు బాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు తూకాలలో వినియోగదారులను మోసాలకు గురిచేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏదేని వస్తువు కొనుగోలులో వినియోగదారులు తూకంలో నిశిత పరిశీలన చేయాలని అన్నారు. కొనుగోలు చేసిన వస్తువు బరువు సక్రమంగా ఉన్నదో లేదో వినియోగదారులు పరిశీలించుకోవాలని తెలిపారు. తూకం తక్కువున్నట్లు గమనిస్తే తక్షణమే వ్యాపారులను ప్రశ్నించాలని ఆయన సూచించారు.
తూకాలఫై అవగాహన
వినియోగదారులు తూకాలలో మోసపోవద్దని వస్తువు కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా ఆయన అవగాహన కల్పించారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు కొలతల పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకొని లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు వినియోగిస్తున్న తూకపు బాట్లను పరిశీలించి ముద్రలు వేయించినట్లు ఆయన పేర్కొన్నారు.