Telangana

వర్షాకాలంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

వర్షాకాలంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

 ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌దవి కాలం ముగిసినందున పంచాయ‌తీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మరింత శ్రద్ధతో, బాధ్యతతో పని చేయాల‌ని పంచాయ‌త్ రాజ్, గ్రామీణాభివృద్ధి , మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క స్ప‌ష్టం చేసారు. వ‌ర్షాకాలం వ‌చ్చే సీజన‌ల్ వ్యాధుల నివార‌ణ‌కు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. జిల్లా అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు గ్రామాల్లో ప‌ర్య‌టించి క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌ల‌హాలు, సూచ‌న‌లివ్వాల‌ని తెలిపారు.

విధులు నిర్వ‌ర్తించ‌ని అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. శాఖ కార్య‌ద‌ర్శి డీఎస్ లోకేష్ కుమార్ తో క‌లిసి మంత్రి సీతక్క డీఆర్డీఓ, డీపీఓ ల‌తో స‌చివాల‌యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. వ‌ర్షాకాలంలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు, గ్రామీణ ఉపాధి హ‌మీ ప‌నులు, వన మహోత్సవం అమ‌లుపై మార్గ‌నిర్దేశం చేసారు. ఈ సంద‌ర్బంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతు..వ‌ర్షాకాలంలో అధికార యంత్రంగ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు.

తాగు నీరు క‌లుషితం కాకుండా జాగ్ర‌త్త‌లు పాటించాలన్నారు. డెంగ్యూ, మ‌లేరియా వంటి రోగాల‌కు కార‌ణ‌మ‌య్యే దోమ‌ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేపట్టాల‌ని పేర్కొన్నారు. గ్రామాల్లో జ్వరాలు వెలుగు చూసిన …వెంట‌నే ఇంటింటి ఫివ‌ర్ స‌ర్వేలు చేప‌ట్టాల‌న్నారు. వైద్య సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసి మ‌లేరియా, డెంగ్యూ టెస్టింగ్ కిట్ల‌ను గ్రామాల్లో అందుబాటులో ఉంచాల‌ని సూచించారు.

ప్ర‌జ‌ల‌కు అత్యంత సామీప్యంగా ఉండే పంచాయ‌తీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ లో ప‌నిచేయ‌డాన్ని అదృష్టంగా భావించాల‌ని తెలిపారు. గ్రామాల్లో ప‌చ్చ‌ద‌నం, స్వ‌చ్చద‌నం పెంచి గ్రామాల‌ను అందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దాల‌న్నారు. అందు కోసం వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ను త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌న్నారు.

పంచాయ‌తీ రాజ్ యంత్రాంగం ఏక‌కాలంలో క‌దిలితే గ్రామాలు స‌మూలంగా మారుతాయ‌ని ఆకాంక్షించారు. వ‌ర్షాకాలంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు గ్రామాల్లో చేస్తున్న పారిశుధ్య ప‌నుల పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు నివేదించాల‌ని ఆదేశాలు జారిచేసారు. ప్ర‌తి ప‌దిరోజుల‌కొక‌సారి మంచి నీటి ట్యాంకుల‌ను శుభ్ర‌ప‌ర‌చాల‌ని సూచించారు.

తాగు నీటి లీకేజీలు లేకుండా చూసుకోవాల‌న్నారు. గ్రామాల్లో గుంత‌ల‌ను పూడ్చి వ‌ర్ష‌పు నీరు నిల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. దోమ‌ల నివార‌ణ కోసం గ్రామాల్లో ప్ర‌తి సాయంత్రం విధిగా ఫాగింగ్ చేయించాల‌న్నారు. ఈ నెలాఖ‌రు లోపు గ్రామాల్లో మార్పు క‌నిపించేలా జిల్లా అధికారులు కార్య‌చ‌ర‌ణ రూపోందించుకోవాల‌ని సూచించారు. గ్రామాల్లో మార్పు క‌నిపించ‌క‌పోతే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *