భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం.
ఖమ్మం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జలాశయాలు, చెరువులు,వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 8712659111 అందుబాటులో వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు,సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉండటంతో రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
అధిక వర్షాల మూలంగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, గ్రామాల్లోని కుంటలు, చెరువులు,వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.విద్యుత్ స్తంభాలు విరిగినా, ప్రమాదాలు పొంచి ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పుశువులు, గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.