గ్రామస్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శిరీష
గ్రామస్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యం
– ఏజెన్సీ ఆదివాసీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి…
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శిరీష
చర్ల, శోధన న్యూస్ : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు వైద్యాన్ని అందించడమే లక్ష్యమని, గిరిజనులకు ప్రబుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకే ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల భవనాలను నిర్మిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జే వి ఎల్ శిరీష తెలిపారు. మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుర్నపల్లి,మామిడిగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను గురువారం ఆమె పరిశీలించారు.అనంతరం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ దివ్య నయన కు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సిబ్బంది గిరిజన ప్రజలకు తగు సూచనలు అందివ్వాలని సూచించారు.అలాగే అటవీ గ్రామాల ప్రజలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే తమ సిబ్బందికి తెలియజేసి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు, దానిలో భాగంగా వైద్యాన్ని గ్రామస్థాయిలో అందించడానికి నూతన భవనాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.డాక్టర్ దివ్యనయనకు పలు సూచనలు చేస్తూ గిరిజన ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఉప కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ చైతన్య, నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా అధికారి దుర్గ, పలువురు వైద్య సిబ్బంది ఉన్నారు.