ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజాభవన్- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజాభవన్
-నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
-ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటా
-నిరుద్యోగులకు అండగా ఉంటా
-ప్రజాభవన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజాభవన్ ఎల్లవేళలా ఉంటుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే అధికారిక నివాసం ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) ను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలుత ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు-పాయం ప్రమీల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ప్రజాభవన్ ప్రారంభోత్సవం సందర్భంగా పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాయం వెంకటేశ్వర్లు అభిమానులు తరలి రావడంతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి. ప్రజాభవన్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, సహకరించిన అఖిలపక్ష నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో సభ్యునిగా అండగా ఉంటానని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని అన్నారు. తన జీవితమంతా పినపాక నియోజకవర్గంతో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటలలో పాల్గొన్నానని, మూడు సార్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లా లోని ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ల సహాకారంతో, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని పెండింగ్ పనులను దశల వారీగా నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తానని అన్నారు. ప్రజాభవన్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజాభవన్ లో నేరుగా తనని కలిసి తమ సమస్యలు తెలిపితే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత నాయకులు పెట్టిన విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టవద్దని గౌరవంగా, హుందా తనంగా ఉండాలని కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసేవిధంగా పని చేయాలని, అడ్డగోలు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్ల రూపాయల మంజూరు చేశారని, ఈ నిధులు అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదే విధంగా నియోజకవర్గంలోని నిరుద్యోగులకు కూడా అందుబాటులో ఉన్న బిటిపీఎస్, సింగరేణి, ఇతర కర్మాగారలలో ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, సిపిఐ రాష్ట్ర నేత అయోధ్య, వైస్ ఎంపిపి కెవి రావు, సర్పంచ్ తాటి సావిత్రి, ఉప్సర్పంచులు పుచ్చకాయల శంకర్, తరుణ్ రెడ్డి, కనకయ్య, కాంగ్రెస్ నాయకులు పీరినాకి నవీన్, కాటి బోయిన నాగేశ్వర్ రావు, చందా సంతోష్, సామా శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇక్బాల్ హుస్సేన్, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.