మహాలక్ష్మీ అవతారానికి ప్రత్యేక పూజలు
మహాలక్ష్మీ అవతారానికి ప్రత్యేక పూజలు
మణుగూరు, శోధన న్యూస్: మండలంలోని ఆలయాల్లో, మండపాల్లో దేవీ శరన్నవరాత్రి మహో త్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం అమ్మవారు మహాలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గుట్టమల్లారంలోని పంచముఖి వేదగాయత్రీదేవి, పైలట్ కాలనీ కాళీమాత ఆలయంలో, సీఎస్పి ప్రాంతంలోని శ్రీకనకదుర్గాదేవి ఆలయంలో, సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్ లలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని రంగు రంగుల పూలు, ఆభరణాలు, పట్టుచీరెలతో మహాలక్ష్మీ అవతార రూపిణిగా సుందరంగా ముస్తాబు చేశారు. మహాలక్ష్మీ అమ్మవారిని భక్తులు, మహిళా భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మండపాల్లో, ఆలయాల్లో అర్చకులు అమ్మవారికి వేదమంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక సహస్ర పుష్పార్చన, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనను జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు.