మిచౌంగ్ తుఫాన్ తో అతలాకుతలం
మిచౌంగ్ తుఫాన్ తో అతలాకుతలం
-భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు
– పంట నష్టం అంచనాల్లో అధికారులు
-పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
-కోతకు గురైన రోడ్లు
సత్తుపల్లి , శోధన న్యూస్: మిచౌంగ్ తుఫానుతో ప్రజలు అతలకుతలమయ్యారు. తుఫాన్ కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. గత రెండు రోజుల నుంచి చిరు జల్లులతో ప్రారంభమైన ఈ తుఫాన్ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అతి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులకు కోతకు గురై గండి పడ్డాయి. కోతకు వచ్చిన వరి పంట, పొట్ట దశలో చేరిన మొక్కజొన్న నేల వాలాయి. చాలా చోట్ల ఈ పంటపై నుంచి వరద నీరు పోయింది. గంగారం చిన్న చెరువు కట్ట తెగడంతో గంగారం రామానగరం మధ్య ఉన్న బీటీ రోడ్డుకు గండిపడి రాకపోకలు నిలిచిపోయాయి. కిష్టారం, చెరుకుపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగిపొర్లడంతో బ్రిడ్జి కొట్టుకుపోయి యాతాల కుంట,అన్నపురెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. దమ్మపేట మండలంలో భారీ వర్షాలు కారణంగా అక్కడి నుండి వచ్చిన వరద బేతుపల్లి ప్రాజెక్టును ముంచెత్తింది. అలుగు భారీగా పోటెత్తింది. ఈ వరద నీరు తమ్మినేని కాల్వ ద్వారా ప్రవహించడంతో తుమ్మూరు, సదాశివనిపాలెం రహదారి దగ్గర భారీగా నీరు పోటెత్తి పంట పొలాలను ముంచెత్తింది. సత్తుపల్లి పట్టణంలోనూ రోడ్లపై వరద నీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. రెవెన్యూ,మండల పరిషత్,పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రజలకు ధైర్యం చెప్పారు.పంట నష్టం అంచనాను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఇతర నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు. వరి కోసిన రైతులు ధాన్యం రాశులకు బరకాలను కప్పారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు బేతుపల్లి ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 16 అడుగులు కాగా, 17.05 అడుగులకు నీరు చేరడంతో ప్రాజెక్టు అలుగు ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు.