అనుమతి తో ప్రచార సామాగ్రి ముద్రించాలి
అనుమతి తో ప్రచార సామాగ్రి ముద్రించాలి
–ఎంసిఎంసి నోడల్ అధికారి శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: అనుమతి పొందిన తర్వాతనే ప్రచార సామాగ్రి ముద్రించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి, ఎంసిఎంసి నోడల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలోని మీడియా కేంద్రంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రచారం కొరకు ముద్రించే కరపత్రాలు, పోస్టర్స్ తదితర అంశాలలో తీసుకోవాల్సిన అనుమతులపై ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలు మేరకు ప్రతి ముద్రణకు తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. ఎన్నికల ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, పోస్టర్లు వంటి ప్రతి ప్రచార సామగ్రిని ముద్రణకు ముందుగా భారత ఎన్నికల సంఘం నిబంధనలు సెక్షన్ 127 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రచురణకు ఇద్దరు వ్యక్తుల డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ముద్రించే ప్రతిపై ముద్రణ సంస్థ పేరు, సెల్ నెంబర్, ముద్రించిన కాపీల సంఖ్య, ప్రచురణ కర్త పేరు తెలియజేయాలన్నారు. అనుమతులు లేకుండా ప్రచార ప్రతులు ముద్రణ చేస్తే ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.. అలాగే ఎన్నికల ప్రచారంకై ముద్రించే ముద్రణలలో వివాదాస్పద వాఖ్యలు కానీ, ఇతరులను కించపరిచే అంశాలు, మత, కులాల ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రచారానికి వినియోగించే ముందు నాలుగు ప్రతులను అందచేయాలని చెప్పారు. అనుమతి పొందిన తర్వాతనే ప్రచారంలో వినియోగించు కోవాలన్నారు. ముద్రణలో క్లెయిము కొరకు బిల్లులు సాధారణ పేపర్ పై ఇవ్వరాదని, సంస్థ బిల్ పై మాత్రమే ఇవ్వాలని, 20 వేలు దాటితే ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా నుండి చెల్లింపులు చేయాలన్నారు. నిబంధనలు పాటించని వారికి రూ2 వేలు జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారి, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు ప్రింటర్స్ పాటించాల్సిన నియమాలపై వివరించారు. ఈ సమావేశంలో ప్రింటర్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.