ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు మృతి
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు మృతి
ఆళ్లపల్లి, శోధన న్యూస్ : తల్లి మందలించిందని మనోవేధనకు గురైన ఓ గిరిజన యువకుడు గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. సంఘటనకు సంబధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లపల్లి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన గోగ్గల మల్లమ్మకు నలుగురి సంతానంలో రెండో కుమారుడు గొగ్గల చంద్రశేఖర్. వీరిధి నిరుపేద కుటుంబం. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చంద్రశేఖర్ అతిగా మద్యం సేవించి, తరుచు ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి మల్లమ్మ చంద్రశేఖర్ ని మద్యం సేవిస్తున్నావంటూ గట్టిగా మందలించడంతో గత శుక్రవారం రాత్రి ఇంటి వెనకాల పెరట్లో ఉన్న గడ్డి మందును సేవించాడు. ఇంట్లో కుటుంబ సభ్యులకు గడ్డి మందు సేవించానని తెలుపడంతో, కుటుంబ సభ్యులు అప్రమత్తమై హుటాహుటిగా ఆళ్లపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రాద్రి కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు ఈ మృతి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.