తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఆరోగ్య వంతమైన చిన్నారుల జననం కోసం పర్యవేక్షణ చేయాలి-జిల్లా కలెక్టర్ ప్రియాంక 

ఆరోగ్య వంతమైన చిన్నారుల జననం కోసం పర్యవేక్షణ చేయాలి 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : గర్భిణి నుండి ఆరోగ్య వంతమైన చిన్నారుల జననం వరకు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అంగన్వాడి సిబ్బందికి సూచించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో జిల్లా మహిళా, శిశు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సేవలపై సిడిపిఓలు, సూపర్వైజర్లుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణలోప చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.  చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు నూరుశాతం బరువు ప్రక్రియ జరగాలని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియలో వ్యత్యాసం ఉండటం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నమోదుల్లో ఎలాంటి వ్యత్యాసాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పోషణలోపం ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ చర్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని 11 ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు  నెలల నుండి మూడు  సంవత్సరాల వయస్సున్న చిన్నారులు 32358 మంది, మూడు నుంచి ఆరు  సంవత్సరాల వయస్సున్న 27077 మంది చిన్నారులున్నట్లు  తెలిపారు.  అలాగే 11 ప్రధాన అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 7436 మంది గర్భిణి మహిళలు, 7181 మంది బాలింతలకు ఆరోగ్యలక్ష్మి ద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల నమోదు ప్రక్రియ నూరు శాతం జరగాలని, వ్యత్యాసం ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులకు, బాలింతలకు రేషన్ అందకపోతే సిడిపిఓలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణిలకు, బాలింతలకు రోజువారి మెనూ ప్రకారం ఆహారం అందచేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులు, మరుగుదొడ్లు నిర్మాణానికి 2018 సంవత్సరంలో నిధులు మంజూరు చేస్తే ఎందుకు పూర్తి చేయలేకపోయారని టిఎస్ఈడబ్ల్యు ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందకురావడం లేదా నిధులు మంజూరు చేసింది మీ దగ్గర పెట్టుకోవడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోషన్వాటికలో చేపట్టిన 55 అంగన్వాడీ కేంద్రాలపై డాక్యుమెంటేషన్తో నివేదికలు అందచేయాలని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలల్లో వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉన్నదని, ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని సిడిపిఓలను అడిగితెలసుకున్న కలెక్టర్ జూలూరుపాడు యంపిడిఓతో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు ఉండాలని వాటిపై నివేదికలు అందచేయాలని చెప్పారు. రానున్న ఫిబ్రవరి మాసం వరకు పూర్తి చేయు విధంగా చర్యలు చేపడతామని, వాస్తవ నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఏసిడిపిఓలు ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పోషణలోపం ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఇంటింటి పర్యవేక్షణ జరగాలని చెప్పారు. రానున్న నెలరోజుల్లో చిన్నారుల ఆరోగ్యంలో ప్రగతి రావాలని సూచించారు. పోషణలోప చిన్నారుల ఆన్లైన్ ప్రక్రియలో సిగ్నల్స్ సమస్య ఉన్నదని సిడిపిఓలు తెలుపగా లిఖితపూర్వకంగా వ్రాసివ్వాలని తెలిపారు. జిల్లా శిశు, మహిళా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి అంగన్వాడీ కేంద్రాల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా శిశు, మహిళా వయోవృద్ధుల సంక్షేమ అధికారి విజేత, అన్ని సిడిపిఓలు, ఏసిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *