ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు తెలిపాలి: నోడల్ అధికారిని విజయ కుమారి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు తెలిపాలి
-నోడల్ అధికారిని విజయ కుమారి
ఖమ్మం, శోధన న్యూస్: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు నమోదు చేయాలని జిల్లా వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారిణి విజయకుమారి అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అకౌంటింగ్ టీం, ఎస్ఎస్టి, విఎస్ టి, వీవీటీ టీమ్ ఉద్యోగులకు వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారిణి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు, ఎంసిఎంసి, ఫ్లయ్యింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీం, వీడియో సర్వేలెన్స్ టీం, వీడియో పరిశీలన టీం, అకౌంటింగ్ టీంలు ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆమోదం, ఆమోద యోగ్యం కాని ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీం, వీఎస్టీ, వీవీటీలు నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ద్వారా నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌షోలో అన్నింటినీ వీడియో సర్వేలెన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి, వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియో పరిశీలించి వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులకు అందజేయాలని, అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని అన్నారు. అనంతరం పూర్తి వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. ర్యాలీలు, సమావేశాల ద్వారా నిర్వహించిన పార్టీ, ప్రచార ఖర్చులు నిర్ణయించిన రేట్ల ప్రకారం నమోదు చేయాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచార వ్యయ ఖర్చుల అకౌంట్లు, రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా బృందాల విధులు, భాధ్యతలపై అవగాహన కల్పించారు. అనంతరం ఇవాల్యూషన్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారిణి విజయనిర్మల, స్టేట్ ఆడిట్ ఉప సంచాలకులు హుస్సేన్ నాయక్, స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్, నిఘా బృందాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.