ఎన్నికల నిబంధనల పై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు -పోలిస్ కమిషనర్ డిఎస్ చౌహాన్
ఎన్నికల నిబంధనల పై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు -పోలిస్ కమిషనర్ డిఎస్ చౌహాన్
యాదాద్రి, శోధన న్యూస్ : ఎన్నికల నిబంధనల పై క్షేత్ర స్థాయి సిబ్బందికి కూడా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఆదివారం రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్ యాదాద్రి భోంగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజ్ లోని డిఆర్సి సెంటర్ ను సందర్శించి అక్కడి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మోత్కూరు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లను సందర్శించి అక్కడి పని తీరును పరిశీలించి వారికి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను సిబ్బందికి అందించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికలను ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్వహించడానికి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. పాత నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని, అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవసరమైన చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.