ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం ఐడిఓసి మిని సమావేశ హాలులో ఎన్నికల నోడల్ అధికారులతో కేటాయించిన విధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ సేవలు కొరకు మార్కెటింగ్ అధికారిని నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. మన జిల్లా నుండి ఇతర జిల్లాలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి 2586 మంది, అలాగే ఇతర జిల్లాల నుండి మన జిల్లాలో ఓటుహక్కు వినియోగానికి 4985 మంది ఫారం 12 ద్వారా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. మన జిల్లా నుండి 36 నియోజకవర్గాలకు పోస్టల్ బ్యాలెట్స్ పంపాల్సి ఉన్నందున పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. సూక్ష్మ పరిశీలకులకు ఎల్టీయం, నివేదికలకు డిఆర్ఎ, హెూం ఓటింగ్ పర్యవేక్షణకు జడ్పి సిఈఓలను ఇన్చార్జ్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. సూక్ష్మ పరిశీలకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని ఎల్టీయంకు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వీల్ చైర్లు, ర్యాంపులు ఏర్పాటు పరిశీలన నివేదికలు అందచేయాలని జడ్పి సిఈఓకు సూచించారు. గత నెలలో పిఓ, ఏపిఓలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు గైర్హాజరైన సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని చెప్పారు. విధులు నిర్వహణలో ఎలాంటి మినహాయింపు లేదని, గైర్హాజరైతే ఎన్నికల సంఘం నియమావళి మేరకు చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఓటుహక్కు వినియోగానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు దివ్యాంగులకు, వయోవృద్దులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పనకు చర్యలు చేపట్టాలని నోడల్ అధికారి లెనీనాకు సూచించారు. 512 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు అంతర్జాల సేవలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 228 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రం లోపల, బయట సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ, పోలింగ్ నిర్వహణ, ఓట్లు లెక్కింపు ప్రక్రియలో వినియోగించాల్సిన యాప్లపై అవగాహన కల్పించాలని ఈడియంను ఆదేశించారు. పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు జరిగిందని, అలాంటి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని తెలిపారు. మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు మోడల్స్ తయారు చేయాలని స్వీప్ నోడల్ అధికారిని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై పిర్యాదు చేయుటకు సి విజిల్ యాప్పై అవగాహన కల్పించాలని తెలిపారు. సి విజిల్ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 142 కేసులకు సంబంధించి 2 కోట్ల 85 లక్షల 85 వేల నగదు సీజ్ చేయడం జరిగిందని, సీజ్ చేసిన నగదుకు సంబంధించి 122 కేసులకు 2 కోట్ల 42 లక్షల 23 వేల రూపాయలు జిల్లా గ్రీవెన్సు కమిటి ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డిఆర్ రవీంద్రనాధ్, జడ్జి సిఈఓ విద్యాలత, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, డిఈఓ వెంకటేశ్వరాచారి, మార్కెటింగ్ అధికారి అలీం, పౌర సరఫరాల డియం త్రినాద్, డిఎస్ఓ రుక్మిణి, పిఆర్ ఈఈ శ్రీనివాసరావు, క్రీడల అధికారి పరందామరెడ్డి, వ్యవసాయ అధికారి అభిమన్యుడు తదితరులు పాల్గొన్నారు.