కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అల
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలకు సంబందించి కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, పరిశీలకులు కమల్ కిషోర్, హరి కిషోర్, గణేష్ లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ లకు చేరిన ఈవీఎం లను పరిశీలించారు. పరిశీలకులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్స్ వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ.సీ కెమెరాల ద్వారా, సాయుధ బలగాల పహారాతో పటిష్ట పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలలో ఉన్నాయన్నారు. జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ పోలింగ్ ప్రక్రియ జరగడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చి పటిష్ట భద్రత మధ్య భద్ర పరిచినట్లు తెలిపారు. పాల్వంచ మండలంలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడంచల భద్రత నడుమ ఆదివారం లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నామని తెలిపారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చిన ఈవీఎంలను జాగ్రత్తగా పరిశీలించి స్ట్రాంగ్ రూంలలోకి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్రమపద్ధతిలో అమర్చామని తెలిపారు. అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశామని తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సాయుధ బలగాలతో పటిష్టమైన పహారా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంల వద్ద సీ.సీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారలమని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, మంగిలాల్, కార్తిక్, ఆర్ అండ్ బి ఈ ఈ భీంలా, మున్సిపల్ కమిషనర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.