ఖరీఫ్ ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి -ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖరీఫ్ ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
-ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం, శోధన న్యూస్ : ఖరీఫ్ ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ధాన్య కొనుగోలు పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 5,63,620 మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా ఉన్నట్లు, దిగుబడి అంచనాల మేరకు కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 236 ధాన్య సేకరణ కేంద్రాలు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. నీడకు టెంట్, టార్పాలిన్, తేమ పరీక్ష, తూకం యంత్రాలు ప్రతి కేంద్రంలో సమకూర్చాలని అన్నారు. రైస్ మిల్లర్ల వద్ద ధాన్య ఆన్ లోడింగ్ కి స్థల లభ్యత ఉండేలా చూడాలన్నారు. ధాన్య కొనుగోలు కేంద్ర బాధ్యులకు సి విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లపై శిక్షణ ఇచ్చినట్లు, రైతులకు ఓటు పై అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ లో భారత పత్తి సంస్థ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, ఇప్పటికి 1500 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో విద్యాచందన, జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.