గల్లంతైన రేగా ఆశలు
గల్లంతైన రేగా కాంతారావు ఆశలు
–నిరుత్సాహంతో వెనుదిరిగిన వైనం
మణుగూరు, శోధన న్యూస్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది. అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని, ఎన్నో ఆశలు పెట్టుకున్న పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు అపజయ భావంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. అది నుంచి తన గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ కోసమే తన ప్రయత్నమని చెప్పిన రేగా కాంతారావును పినపాక నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ నుండే సిపిఐ, టిజెఎస్, టిడిపి, వైఎస్ఆర్ టిపిలు బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకే స్పష్టమైన మెజార్టీ కనబరుస్తుండడంతో రేగా కాంతారావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కింత నిరుత్సాహానికి గురయ్యారు. రౌండ్ రౌండ కు బీఆర్ఎస్ ఓట్ల మెజార్టీ పెరుగుతుందన్న ఆశలు అడియాశలుగానే మారాయి. కానీ ప్రతీ రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పాయం ఆధిక్యం సెరుగుతూ వస్తుండడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. సుమారు 14 రౌండ్ల వరకు కౌంటింగ్ ముగిసే సరికి పాయం వెంకటేశ్వర్లు 28,930 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉండడంతో ఇక బీఆర్ఎస్ అభ్యర్థి, పార్టీ శ్రేణులు ఆశలు వదులుకున్నారు. మిగతా రౌండ్లు పూర్తి కాకముందే రేగా కాంతారావు నిరుత్సాహంతో వెనుదిరిగారు.