ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం
ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం
-తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, శోధన న్యూస్: మహబూబ్ నగర్ లో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఆర్యాసమాజ్ లో దసరా ఉత్సవ కమిటీ కార్యవర్గంతో కలిసి మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మహబూబ్ నగర్ దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోనే గొప్ప పేరు ఉందన్నారు. గతంలో దసరా ఉత్సవ కమిటీ సమావేశాల కోసం ఒక్కో ఏడాది ఒక్కోచోట ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ లో నిర్మించిన గణేష్ భవన్ లో ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.దసరా ముగింపు ఉత్సవాలకు కూడా ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అందుకే ఇప్పటి నుంచి ట్యాంక్ బండ్ వేదికగా దసరా ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఐలాండ్ లో శాశ్వతంగా జమ్మిచెట్టు నాటి దసరా కట్టను నిర్మించడంతోపాటు శాశ్వతంగా ఉత్సవాలు, బాణాసంచా కార్యక్రమం అక్కడే కొనసాగుతుందన్నారు.దసరా రోజున ఆర్యసమాజ్ నుంచి ఊరేగింపు బయలుదేరి క్లాక్ టవర్ అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ ఐలాండ్ వరకు చేరుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.దసరా ఉత్సవ కమిటీ సూచనల మేరకు ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం అన్నారు.ట్యాంక్ బండ్ వద్ద స్వరలహరి కల్చరల్ అకాడమీ, దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాలతో పలు సాంస్కృతిక సంస్థల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.