నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి -జిల్లా కలెక్టర్ రవినాయక్
నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
-జిల్లా కలెక్టర్ రవినాయక్
మహబూబ్ నగర్, శోధన న్యూస్: నవంబర్ 3 నుండి శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్ల సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి రవి నాయక్ అన్నారు.బుధవారం ఆయన జిల్లా ఎస్ పి హర్షవర్ధన్ తో కలిసి శాసనసభ ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలతో పాటు ,నామినేషన్ల పై రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ముందుగా జిల్లా కలెక్టర్ కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న దరఖాస్తులు,ఫారం-8 ఫై సమీక్షిస్తూ ఇంకా ప్రాసెస్ చేయాల్సి ఉన్న ఫారాలాన్నింటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలను తక్షణమే పంపించాలని, అయితే ఇదివరకు ఉన్న ఆవరణలోనే ఆక్సీలరీ పోలింగ్ స్టేషన్లు ఉండాలని ఆయన తెలిపారు. నవంబర్ 3 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు ముందే చేసుకోవాలని, తగినన్ని నామినేషన్ పత్రాల సెట్లు,ఇతర సామాగ్రి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణకు తగు ఏర్పాట్లు,సిబ్బంది వంటివి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు జారీ చేసిన ఉత్తర్వులు అందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత నోడల్ అధికారి తో పాటు, జిల్లా అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరికి ఎన్నికల విధులనుండి మినహాయింపు ఇవ్వొద్దని, అందరు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సువిధ ద్వారా ఎప్పుటి దరఖాస్తులకు అప్పుడే అనుమతులివ్వాలని,ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని ఆదేశించారు.ఇప్పటివరకు సి -విజిల్ ద్వారా 7 దరఖాస్తులు రాగా 7 పరిష్కరించినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సి విజిల్ పై ఇంకా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, అదేవిధంగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ పై సైతం అవగాహన కల్పించాలని, 1950 కింద వచ్చిన ఫిర్యాదులన్నిటిని పరిష్కరించాలని, సమస్యత్మక, అత్యంత సమస్యత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ను రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సంప్రదించి పంపించాలని, ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాల పని తీరు ఇంకా పెంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఓటు హక్కు, ఓటు ప్రాధాన్యత, ఓటరు నమోదు అంశాలపై స్వీప్ నోడల్ అధికారి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా ఎన్నికల ప్రణాళికను వెంటనే పంపాలని, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయించేందుకు ఇప్పటినుంచే ఏర్పాటు చేయాలని పిడబ్ల్యుడి ఓటర్లు ఇతర ఓటర్లు సంక్షేమంపై తీసుకున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీ ఇప్పటివరకు 65 కేసులకు సంబంధించి నగదు సీజ్ చేసి 42 కేసులకు సంబంధించి నగదు విడుదల చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి నోడల్ టీం ఇతర నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ పునరుద్ఘాటించారు.