పకడ్బంధీగా ఎన్నికలు నిర్వహించాలి-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
పకడ్బంధీగా ఎన్నికలు నిర్వహించాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
మంచిర్యాల, శోధన న్యూస్: శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు 2023లో భాగంగా ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నిస్పక్ష పాతంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్జ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లోగల సింగరేణి అతిథి గృహంలో అదనపు డిజిపి సంజయ్ కుమార్ జైన్ తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, సిపి., అదనపు కలెక్టర్లు, ఎస్పి లు, డిసిపి లు, ఎసిపి లు, ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు సింగరేణి అతిథి గృహం వద్ద గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ప్రజలను చైతన్య పరిచేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను.. అనే నినాదంతో కొనసాగుతున్న కళాజాత కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్, డిసిపి సుధీర్ రాంనాథ్ కేకెన్ లతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమవేశ మందిరంలో అదనపు డిజిపి సంజయ్ కుమార్ జైన్ లతో కలిసి మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు బదావత్ సంతోష్, రాహుల్ రాజ్, బొర్కడే హేమంత్ సహదేవరావు, ఆశిష్ సంగ్వాన్, రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, ఆదిలాబాద్ ఎస్.పి. ఉదయ్ కుమార్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ ఎస్.పి. సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పి చల్లా ప్రవీణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, చెకో పోస్టుల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, శాంతి భద్రతలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఈ నెల 30వ తేదీ వరకు 18 సం॥ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు వివరాలు నమోదు చేసుకునే విధంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఓటరు నమోదు, పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే
సమయంలో నిబంధనలు పాటిస్తూ నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించాలని, సరిగ్గా నింపని పక్షంలో సదరు అభ్యర్థులకు వ్రాత పూర్వకంగా సమాచారం అందించాలని అన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేయలెన్స్, వీడియో సర్వేయలెన్స్, వీడియో పరిశీలన, అకౌంటింగ్ బృందాల అధికారులు తమకు కేటాయించిన విధులను ఖచ్చితంగా నిర్వర్తించాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అనుమతి జారీ చేసే విధంగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేయాలని, శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సువిధ యాప్ను నిరంతరం పరిశీలించాలని, ఎన్నికలకు సంబంధించి నివేదికలను ప్రతి రోజు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి కంట్రోల్ రూమ్, 1950, సి-విజిల్లో అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వేగంగా పరిష్కరించాలని, పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, లైటింగ్, ర్యాంపు, నీటి సరఫరాతో కూడిన మూత్రశాలలు ఉండాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. చెక్ పోస్టుల వద్ద నగదు, మద్యం తరలించకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, సరైన ఆధారాలు లేని నగదు, మద్యం, ఇతర ప్రలోభ సామాగ్రి లభించినట్లయితే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలిపారు. కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ, వెబ్కాస్టింగ్, శాంతిభద్రతల పరిరక్షణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఖర్చుల పర్యవేక్షణ ఇతర ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల సమన్వయంతో నివేదికలు సమర్పించాలని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, పత్రికా ప్రకటనలు, పత్రికా సమావేశాలు, పత్రికా కత్తిరింపుల సమర్పణ, ప్రకటనలు పెయిడ్ న్యూస్ కేసుల సమీక్ష, కమ్యూనికేషన్ ప్లాన్, దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులకు సౌకర్యాల నిర్వహణ, సమస్యాత్మక ప్రాంతాలలో కమ్యూనికేషన్ ఏర్పాట్లపై చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల,
కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వారిగా ఎన్నికల నిర్వహణపై అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, జిల్లాలలో చేపడుతున్న ఎన్నికల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.