పినపాక నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : మిచౌంగ్ తుఫాన్ ఉదృతంగా వస్తున్న నేపథ్యంలో పినపాక నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం సూచించారు. ఈ . సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తుఫాన్ ప్రభావ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, నది ప్రవాహాల ఉదృతి పెరిగే అవకాశం ఉందని, గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్థంభాలను తాకరాదని, పిడుగు పడే సమయంలో రైతులు, రైతు కూలీలు చెట్ల క్రింద ఉండరాదని సూచించారు. నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అప్రమత్తతో వ్యహరిస్తూ… ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఆస్తి నష్టం, పంట నష్టం ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తుఫాన్కు సంబంధించిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్, ఆయా అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజలు అధైర్య పడవద్దనీ, అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని కోరారు. అత్యవర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08744-241950 సంప్రదించాలన్నారు.