ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్
ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి:
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి సూచించారు. లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ నందు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమాలు ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.