ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఆయుధం ఓటు- తెలంగాణ సిఎం కెసిఆర్
ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఆయుధం ఓటు
-ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దు
-ప్రజల తలరాతను మార్చేది.. భవిష్యత్తును నిర్ణయించేది ఓటే.
-తొర్రూరు, పాలకుర్తి నియోజకవర్గ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
వరంగల్, శోధన న్యూస్ : ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఆయుధం ఓటు అని, ప్రతిపక్షాలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా.. ఎన్నికలలో ఆగమాగం కాకుండా.. అభ్యర్థి గుణగణాలను.. పార్టీ చరిత్రను, పనిచేసే వాళ్లను ఎంచుకొని ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి, పాలకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా కూడా ప్రజాస్వామ్యంలో రావలసిన పరిణితి రాలేదని అన్నారు. ఎన్నికల అనగానే ఆగమాగం కావద్దని వాస్తవాలు గమనించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకొని ఓట్లు వేస్తే ప్రజలు బాగుపడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఓటు మీ తల రాతలను మారుస్తుందని అన్నారు. టిఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ప్రజల బాగు కోసం అని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఆయుధం ఒటేనని అన్నారు. ఎలక్షన్లు చాలాసార్లు వచ్చాయని, అందులో వరుసగా ఎర్రబెల్లి దయాకర్ రావుని మీరు గెలిపించుకున్నారని.. కానీ ఈసారి ఆలోచించి నిజా నిజాలు గమనించి మీకు పని చేసే ప్రభుత్వానికే ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి మీకు తెలియనిది కాదని, ఆ పార్టీని గెలిపిస్తే 24 గంటల కరెంటు ఉండదని, రైతు బంధు, రైతు బీమా మొదలుకొని సంక్షేమ పథకాలన్నింటినీ సర్వనాశనం చేస్తారని అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, అలాంటిది దయాకర్ రావు మీకు చెక్ డాములు కట్టించి వ్యవసాయానికి, తాగునీటికి నీటి వసతిని ఏర్పాటు చేశారని కితాబునిచ్చారు. దుర్మార్గమైన కాంగ్రెస్ గెలిస్తే మనం ఆగమాగం అయిపోతామని అన్నారు. రాబోయే కాలంలో మొదటి రెండు ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని, గిరిజన బంధు కూడా ఇస్తామని అన్నారు. సభలో ఇప్పుడు ఒక లక్ష మంది కనిపిస్తున్నారని.. యువకులు, నాయకులు త్యాగం చేసి దయాకర్ రావుని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మవద్దని అమెరికా నుంచి వచ్చి పోయేవారికి పాలకుర్తి ప్రజల అవసరాలు ఏమి తెలుస్తాయని కాంగ్రెస్ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని విమర్శించారు. పాలకుర్తికి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని దయాకర్ రావు కోరగా తప్పకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్, బిజెపిల వైఖరి మీ అందరికీ తెలుసు అని, ఎన్నారైలు నియోజకవర్గంనకు ఏ విధంగా సేవ చేస్తారని అన్నారు. సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని అన్నారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.