ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు
ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు
అశ్వాపురం, శోధన న్యూస్: ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. గురువారం రంగ రంగ వైభవంగా ప్రారంభమెన ప్రజాపాలన కార్యక్రమాన్ని అశ్వాపురం. మండలం, అమెర్దా గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి గడపకూ సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీ ల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో ప్రజా పాలన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తులు ఉచితంగా ప్రజలకు ఇస్తున్నామని, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తులు జిరాక్స్ తీయుటకు నామమాత్రపు ధర తీసుకోవాలన్నారు. ఎక్కువ వసూళ్లు చేస్తే కఠిన చర్యలతో పాటు పోలీస్ కేసు నమోదు సెంటర్ మూసివేస్తామని హెచ్చరించారు. దరఖాస్తులు పూర్తి చేయుటకు అన్ని కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు దళారులను నమ్మొద్దని ఎవరైనా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తామన్నారు. సలహాలు, సూచనలు కొరకు ప్రజాపాలన కేంద్రాల అధికారులను సంప్రదించాలని తెలిపారు.