ప్రజా పాలన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
ప్రజా పాలన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ప్రజాపాలన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులకు సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ…ప్రజాపాలన కార్యక్రమం మొదటిరోజు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన అని ఆమె తెలిపారు. గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరణకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని మొత్తం 481 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలలో గురువారం ప్రారంభమైన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి అధికసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీలైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నామన్నారు. తొలి రోజు 83 గ్రామపంచాయతీలు, 23 మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించామని, 52880 కుటుంబాల నుండి 25087 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రసీదు అందజేయడంతో పాటు రిజిస్టర్ లో నమోదు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు రెండు షిప్టులలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇంటికి ప్రజాపాలన దరఖాస్తులు ఉచితంగా అందచేస్తున్నామన్నారు. ప్రజలు దళారుల బారిన పడొద్దని ఆమె సూచించారు. దరఖాస్తులు నింపుటకు ప్రజల సహాయార్థం ప్రతి కౌంటర్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా దరఖాస్తులు నింపుటకు సహాయ, సహకారాలు అందిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఎవరైనా జిరాక్స్ అవసరం ఉంటే నామమాత్రపు అంటే ప్రస్తుతం ఉన్న ధర మాత్రమే తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదుతో పాటు సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిరాక్స్ కేంద్రాలపై పర్యవేక్షణ చేయాలని, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే సంబంధిత తహసీల్దార్, ఎంపిడిఓ, ఆర్డిఓ కార్యాలయంలో పిర్యాదు చేయాలన్నారు. 29వ తేదీన యధావిధిగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.