ప్రతీ ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి –ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్
ప్రతీ ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి
–ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్
మధిర, శోధన న్యూస్: ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. మధిర మండల పర్యటనలో భాగంగా ఆయన ఖాజీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. భద్రతా చర్యలకు సంబంధించి పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. వైఎస్ఆర్ చౌరస్తా సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి గోడపై ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే విధంగా విద్యార్ధి గీసిన చిత్రాలను తిలకించారు. కలెక్టర్ సైతం ఈవీఎంపై అవగాహన కల్పించే విధంగా చిత్రాలు గీసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. అందంగా బొమ్మలు వేసిన భరత్ తో పాటు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో గొప్పదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఎన్నికలకు లోబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనే వజ్రాయుధంతో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అనంతరం టీవీఎం పాఠశాలలో పోలింగ్ సిబ్బందికి జరుగుతున్న శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. ఓటింగ్ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనకు లోబడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి గణేష్, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.