బోడెపుడి స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తా
బోడెపుడి స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తా
-సీపీఎం అభ్యర్ది పాలడుగు భాస్కర్
మధిర, శోధన న్యూస్ : మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే బోడెపూడి స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని పాలడుగు భాస్కర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన మధిర పట్టణంలోని పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గం సీపీఎం నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు కట్టబెట్టారని తెలిపారు. అయితే వారు ఆర్భాటాలు, హడావుడి చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వీధి వ్యాపారస్తులను వీధిపాలు చేశారని అన్నారు. పట్టణంలో పరిశుభ్రత, తాగునీరు, నిజాయితీ పాలన కరువైందని విమర్శించారు. మధిర మాజీ ఎమ్మెల్యే బోడెపుడి వెంకటేశ్వరరావు వారసత్వంతో ముందుకు వెళుతున్నామని, నియోజకవర్గ ప్రజలు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, మద్దాల ప్రభాకర్, తేలప్రోలు రాధాకృష్ణ, విల్సన్, జానీ, ఆవుల శ్రీను, దోర్నాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.