బోధన లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి
బోధన లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు,అశ్వాపురం మండలాల లోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విద్యాధికారి, బోధనలో, మధ్యాహ్నం భోజనం నిర్వహణలో, FRS అటెండన్స్ లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు లను ఇవ్వాలని మండల విద్యాధికారిని అదేశించారు. మణుగూరు మండలం లోని సమితి సింగారం, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం 1గం. వరకు మధ్యాహ్న భోజనం అందించక పోవడం, PTM సమావేశాలను నిర్వహించకుండానే , నిర్వహించినట్టు మినిట్స్ రాయడం, హాజరు శాతం చాలా తక్కువగా ఉండటం పట్ల జిల్లా విద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సదరు పాఠశాలలో ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను ఇవ్వమని మండల విద్యాధికారిని ఆదేశించారు.అదేవిధంగా మణుగూరు మండలంలోని శ్రీ సాయి నగర్ ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించి పిల్లల్లో లభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వాటిని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో – ఎడ్యుకేషన్, మణుగూరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామానుజవరం ను సందర్శించి ఎఫ్. ఆర్.ఎస్ అటెండెన్స్ లో సంబంధిత పాఠశాలల హాజరు శాతం చాలా తక్కువగా ఉండటాన్ని పరిశీలించి, ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల పాఠశాలలోని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అశ్వాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురం, ప్రాథమిక పాఠశాల సీతారాంపురం, ప్రాథమిక ఉన్నత పాఠశాల గొల్లగూడెంలను సందర్శించి, విద్యార్థులలోని అభ్యసన సామర్ధ్యలను పరిశీలించి, తొలి మెట్టు, ఉన్నతి కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం బోధన, అభ్యసనలో భాగమైన వర్క్ బుక్స్ నిర్వహణ, కరెక్షన్ చేయడం, వంటి పనులను క్రమం తప్పక నిర్వహిస్తూ, విద్యార్థుల్లో కనీస సామర్ధ్యాలను పెంపొందించే తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్బంగా ప్రాథమికోన్నత పాఠశాల గొల్లగూడెం నందు నిర్వహించబడుతున్న దివ్యాంగ పిల్లల సర్వే ను కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్శన లో పాఠశాలలలో మధ్యాహ్న భోజనం అమలు, మన ఊరు మన బడి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా సెక్టోరల్ అధికారులు యస్. కె. సైదులు, ఎన్. సతీష్ కుమార్, మండల విద్యాధికారి వీరాస్వామి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.