తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి -మంత్రి తుమ్మల నాగేశ్వరావు

భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి

-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఆదివారం ఐటిసి విశ్రాంతి భవనంలో జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు, భద్రాచలం అభివృద్ధికి బిపిఎల్ ద్వారా సిఎస్ఆర్ నిధులు కేటాయింపు, సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు నిధులు మంజూరు, భూ సేకరణ, పోడు సమస్య, జిల్లాలో శాంతి భద్రతలు పరిస్థితులు, ఆంధ్రలో కలిసిన 5 పంచాయితిలు తిరిగి తెలంగాణలో విలీన ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఎస్పీ డాక్టర్ వినీత్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ భద్రాచలం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులు వాటి పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదికల రూపొందించాలన్నారు. జిల్లాకు సంబంధించి శాంతి భద్రతలు, రెవెన్యూ, గోదావరి, ఇసుక రవాణా, వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులను ఈ సీజన్ లో పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, భూ సమస్యలు, అన్ని శాఖల పెండింగ్ పనులు, మధ్యలో ఆగిపోయిన పనులు సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. పరిపాలనలో నిర్లక్ష్యం, అలసత్వం, అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని శాఖలను బలోపేతం చేయాలని తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు గిరిజన ప్రాంతమని, గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న జిల్లా అని ప్రభుత్వం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలని మంత్రి స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణ అభివృద్ధికి ఐటిసి నుండి సిఎస్ఆర్ నిధులను ప్రతి ఏటా 2.50 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ కు అందచేయాలని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి మన రాష్ర్టంలో విలీనం చేయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రాచలం అభివృద్ధిలో ఐదు పంచాయతీలు చాలా కీలకమని తెలిపారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావొద్దని తెలిపారు. రామాలయం అభివృద్ధితో భద్రాచలం పట్టణ అభివృద్ధికి పట్టణంలోని రహదారులను, డివైడర్లు ఏర్పాటు తదిరత ఏర్పాట్లు కు ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *