మందు పాతర గుర్తింపు – నిర్వీర్యం చేసిన చర్ల పోలీసులు
మందు పాతర గుర్తింపు – నిర్వీర్యం చేసిన పోలీసులు
– పోలీసుల చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం…
– మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు..
చర్ల, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సారత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ మావోయిస్టులు పన్నిన వ్యూహాన్ని చర్ల పోలీసులు ఎంతో చాకచక్యంతో తిప్పి కొట్టి మావోయిస్టులపై భారీ విజయాన్ని సాధించారు.గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మండల వ్యాప్తంగా 36 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్, ఓ ఎస్ డి టి సాయి మనోహర్, భద్రాచలం ఏ ఎస్ పి పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు చర్ల సీఐ బి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఎస్సైలు టివిఆర్ సూరి, నర్సిరెడ్డి, వెంకటప్పయ్యలు సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అటవీ గ్రామాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరేవరకు రక్షణ చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని కలివేరు గ్రామము నుండి తిప్పాపురం గ్రామం వరకు వెళ్ళు ప్రధాన రహదారిపై చిన్న మిడిసిలేరు గ్రామం దాటిన అనంతరం అంజనాపురం,బెస్త కొత్తూరు గ్రామాల మధ్య వంతెన వద్ద రహదారి తవ్వి మావోయిస్టులు ఏర్పాటు చేసిన 40 కేజీల కంటైనర్ భారీ మందు పాతరను బాంబు స్కాడ్ బృందం మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తుండగా గురువారం గుర్తించి స్థానిక సీఐ బి రాజగోపాల్ కు తెలపడంతో ఆయన జిల్లా పోలీసు అధికారులకు మందు పాతరను గుర్తించిన విషయాన్ని తెలిపారు.గురువారం సంఘటన ప్రాంతానికి చేరుకున్న జిల్లా ఓఎస్డి టి సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ మందు పాతరను పరిశీలించి బాంబ్ స్కాడ్ సహాయంతో వాటికి ఉన్న వైర్లను కట్ చేశారు.గురువారం సాయంత్రం వరకు ఎన్నికలు కొనసాగుతున్న క్రమంలో మందు పాతరను నిర్వీర్యం చేసే ప్రక్రియను వాయిదా వేసి శుక్రవారం ఉదయం భారీ మందు పాతరను నిర్వీర్యం చేశారు.మందు పాతర నిర్వీర్యం చేసిన ఘటనా ప్రదేశంలో 9 అడుగుల లోతు,ఐదున్నర మీటర్ల వెడల్పుతో గోయి ఏర్పడింది. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు కంటైనర్ రూపంలో 40 కేజీల భారీ మందు పాతర తాజాగా ఏర్పాటు చేసి ఉంటారని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.ఎన్నికలవేళ మావోయిస్టులు పలు హింసాత్మాక ఘటనలకు పాల్పడతారని పోలీసులు భావించి మండలంలో భారీగా వివిధ కంపెనీలకు చెందిన బలగాలను మోహరించారు.అయినా మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ధాన్యం లారీని అడ్డగించి, ధాన్యం దింపి ఖాళీ లారీకి నిప్పంటించి దగ్ధం చేశారు.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన చర్ల సిఐ బి రాజగోపాల్ ఆధ్వర్యంలోని పోలీసులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు తగిన వ్యూహ రచన చేసి భారీ మందు పాతరను గుర్తించి నిర్వీర్యం చేసి మావోయిస్టులపై పై చేయి సాధించారు.