మధిరను అభివృద్ధి చేద్దాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిరను అభివృద్ధి చేద్దాం
-అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, శోధన న్యూస్: మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం మధిర క్యాంపు కార్యాలయంలో డిఆర్డిఓ ఐకెపి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగానికి మక్కువ చూపిస్తున్న క్రమంలో మధిర నియోజకవర్గంలో సేంద్రియ పంటలను ఉత్పత్తి చేయడం వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వివరించారు. వ్యవసాయ నిపుణులను పిలిపించి లాభసాటిగా ఉండే పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పండించిన పంటలకు సైతం పంట పెట్టుబడికి మించి మంచి లాభాలు వచ్చే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి తగిన ప్రాజెక్టును త్వరలోనే రూపొందిస్తామని వివరించారు.
-మానవ వనరులను వాడకపోవడం నేరం:
మానవ వనరులు అత్యంత బలమైనవి ఈ మానవ వనరులను వాడకపోవడం నేరమని భట్టి విక్రమార్క అన్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం మానవ వనరులకు సరైన ప్రాధాన్యతను ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మానవ వనరులను సంపదగా భావించి వారికి సరైన తర్ఫీదు ఇస్తే సంపదను సృష్టించవచ్చని ఆయన వివరించారు. నియోజకవర్గంలోని మహిళలకు వివిధ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డిఆర్డిఓ అధికారులను ఆదేశించారు. కుట్టు శిక్షణ, సబ్బు తయారీ, అగర్బత్తిలు తయారీ, కొవ్వొత్తిల తయారీ, తదితర స్వయం ఉపాధి రంగాలపై అవగాహన సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్మాల్, మీడియం ఇండస్ట్రీ నిపుణులతో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఇప్పించి వారు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణకు 2013లో సెంటర్కు 20 చొప్పున ఇప్పించిన మిషన్లు ఏం చేశారని అధికారులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన మిషన్లు తుప్పు పడుతున్న క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 2021లో పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పిన సమాధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ కుట్టు మిషన్లు తెప్పించిన లక్ష్యానికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి విద్యాచందన, జంగం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.