మధిరలో భట్టి విక్రమార్క విజయం
మధిరలో భట్టి విక్రమార్క విజయం
మధిర , శోధన న్యూస్ : మధిర అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుపై 35,452 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 1,94,614 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు 1,805 నమోదయ్యాయి. ఈ రెండిటిని కలిపి మొత్తం 1,96,419 నమోదయ్యాయి. వీటిలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క కు 1,07817 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు 1,153 వచ్చాయి. బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకి 73,038 ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 480 వచ్చాయి. దీంతో భట్టి విక్రమార్క భారీ మెజార్టీతో విజయం సాధించారు. మధిర అసెంబ్లీ ఎన్నికలు 19 రౌండ్లో లెక్కించారు. ప్రతి రౌండ్లో మల్లు భట్టి విక్రమార్కు భారీ స్థాయిలో మెజారిటీ ఓట్లు లభించాయి. నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో మల్లు భట్టి విక్రమార్క కు భారీ మెజార్టీ రావడం విశేషం. మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుండి నాలుగు సార్లు విజయం సాధించారు. తొలిసారిగా మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుండి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి మల్లు భట్టి విక్రమార్క 12 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018లో మూడోసారి పోటీ చేసిన మల్లు భట్టి విక్రమార్క 3500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాలుగోసారి పోటీ చేసిన ఈ ఎన్నికల్లో మల్లు భట్టి విక్రమార్క 35 వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఒకే అభ్యర్థిపై వరసగా నాలుగు సార్లు ఘనవిజయం సాధించిన ఘనత మల్లు భట్టి విక్రమార్కకే దక్కింది.