మధిరలో సిఎం కెసిఆర్ సభ సక్సెస్
మధిరలో సిఎం కెసిఆర్ సభ సక్సెస్
-బిఆర్ఎస్ లో జోష్ నింపిన కెసిఆర్ ప్రసంగం
-సభకు భారీగా హాజరైన మహిళలు
మధిర , శోధన న్యూస్ : మధిరలో సిఎం కెసిఆర్ సభ సక్సెస్ అయ్యింది. మధిర బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం మధిర పట్టణంలో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సభకు నియోజక వర్గం నుండి భారీ స్థాయిలో మహిళలు యువత హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే సభా స్థలానికి కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావడం పట్ల టిఆర్ఎస్ నాయకుల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన తీరు సభికులను ఎంతో ఆకట్టుకుంది. స్థానిక శాసనసభ్యుల మల్లు భట్టి విక్రమార్కపై విమర్శలు చేయడంతో కార్యకర్తలు చప్పట్లు కొట్టి హర్షాధికేతాలు వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అడగకపోయినా చింతకాని మండలానికి దళిత బంధు ఇచ్చానని, బోనకల్లు మండలానికి దళిత బంధు ప్రకటించారని, ఈ ఎన్నికల్లో లింగాల కమల్ రాజ్ ని గెలిపిస్తే మధిర నియోజకవర్గానికి మొత్తం దళిత బంధు ఇస్తానని ప్రకటించడంతో సభకు వచ్చిన దళిత వర్గాలు కేరింతలు కొట్టారు. అదేవిధంగా సీఎం సభలో స్థానిక సమస్యలను సైతం గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో మధిరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిల్లకల్లు నుండి కరెంట్ వచ్చేదన్నారు. దీనివల్ల నిరంతరం మధిర చిమ్మ చీకట్లో ఉన్నదని ఆయన గుర్తు చేశారు. తాను ప్రత్యేకంగా జిల్లా అధికారులతో మాట్లాడి ఖమ్మం నుండి మధిరకు కరెంటు ఇచ్చి మధిరను వెలుగుల్లో నింపానన్నారు. భట్టి ని గెలిపిస్తే ఉచిత విద్యుత్తు ఉండదని, దళిత బందు ఉండదని, రైతుబంధు రాదని సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సవాన్ని నింపింది. ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడంతో ఈసారి మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరవేయటం ఖాయమంటూ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ సభా వేదిక వద్ద సందడి చేశారు.