మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
ఎనిమిది జిల్లాల్లో భరోసా కేంద్రాలను వర్చ్యువల్ గా ప్రారంభించిన రాష్ట్ర డీజిపి రవి గుప్తా
-మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మంగళవారం రాష్ట్ర డీజిపి రవిగుప్తా ఐపిఎస్ డీజిపి కార్యాలయం నుండి ఎనిమిది జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను వర్చ్యువల్ గా ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం నుండి జరిగిన ఈ కార్యక్రమంలో ఉమేన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజిపి శిఖా గోయల్ ఐపిఎస్, అడిషనల్ డీజిపి సీఐడి మహేష్ భగవత్ ఐపిఎస్,మల్టీ జోన్-1&2 ఐజీ తరుణ్ జోషి ఐపిఎస్ లు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని అన్నారు. హత్యాచార కేసులు,పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు,సైకాలజిస్టు,న్యాయాధికారి,పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే భరోసా కేంద్రం పని చేస్తుందని అన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు. వీటితో పాటు ఈ భరోసా సెంటర్లలో బాధితులకు వివిధ రంగాలలో నైపుణ్యతను నేర్పించి,వారిని సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతుందన్నారు. అనంతరం భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులను, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను ఎస్పీ పరిశీలించారు. ముఖ్యంగా మహిళలు ఒకేచోట అన్ని రకాల చట్టపరమైన సేవలను పొందేటందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, షీ టీం ఇంచార్జి ఎస్సై రమాదేవి, ఎహెచ్ టీయూ ఎస్సై శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,రాజువర్మ, టూ టౌన్ సిఐ రమేష్, ఎస్సైలు నరేష్, సంతోష్, రవి, పురుషోత్తం, జుబేదా, విజయ, విజయకుమారి, భరోసా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.