రాజకీయ ప్రకటనలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
రాజకీయ ప్రకటనలపై నిరంతర పర్యవేక్షణ
-జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: రాజకీయ ప్రకటనలపై ఎంసిఎంసి కమిటీ నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల ప్రక్రియలో జారీ చేయాల్సిన ఫ్రీ సర్టిఫికేషన్, పెయిడ్ న్యూస్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై ఎంసిఎంసి, సోషల్ మీడియా కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్నికల ప్రవర్తన నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాద్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను నిరంతరం పర్యవేక్షిస్తూ లోకల్ ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులను జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటి (ఎంసిఎంసి) జారీ చేయాలని అన్నారు .కమిటి సభ్యులు నిరంతరం వివిధ దినపత్రికలు, టెలివిజన్, సామాజిక మాధ్యమాలు, సిటి కేబుల్ తదితర ప్రచార మాద్యామాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను రూపొందించి ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ ఛానల్ లు, సోషల్ మీడియా, వాట్సప్ ఛానల్, ఈ పేపర్లు, ఇతర ప్రసార మాధ్యమాలలో రాజకీయ ప్రకటనలు పరిశీలించాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు.
సోషల్ మీడియాలో విద్వేష పూరిత ప్రసంగాలు, కుల, మతాలు వంటి రెచ్చ గొట్టే పోస్ట్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సోషల్ మీడియా టీమ్ కు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించేలా ప్రకటనలు, పోస్ట్ ల పై రిటర్నింగ్ అధికారుల ద్వారా నోటీస్ జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకు రావాలని, సరైన సమాచారాన్ని ప్రజలకు తెలియాచేయాలని సూచించారు. పోస్టర్లు, కర పత్రాలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచురణ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎం సి ఎం సి కమిటీ బాధ్యత చాలా ప్రధాన మైనదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఏ రోజు ప్రచురితమయ్యే పెయిడ్ న్యూస్ అదే రోజు లెక్కింపు చేసి వ్యవ నోడల్ అధికారికి నివేదికలు అందచేయాలన్నారు.
ఈ సమావేశం లో ఎంసి ఎంసి కన్వీనర్ డిపిఆర్వో శ్రీనివాస్, ఆకాశవాణి ప్రోగ్రాం అధికారి శ్రీనివాసన్, కమిటీ సభ్యులు జునుమాల రమేష్, ఈడీఎం విజయ సారధి, జిల్లా సమాచారన విజ్ఞాన అధికారి ఎస్. సుశీల్ కుమార్, ఎస్పి పిఆర్వో డి. శ్రీనివాస్, పోలీస్ ఐటి పరిశీలకులు నరేన్ తదితరులు పాల్గొన్నారు.