ఖమ్మంతెలంగాణ

రాష్ట్రంలో 78 స్థానాల్లో గెలిచేది కాంగ్రెస్సే   – మధిర కాంగ్రెస్  అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలో 78 స్థానాల్లో గెలిచేది కాంగ్రెస్సే 

 – మధిర కాంగ్రెస్  అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క

మధిర, శోధన న్యూస్ :  తెలంగాణ రాష్ట్రంలో 78 స్థానాల్లో గెలిచేది కాంగ్రెస్సే  అని  సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మధిర పోరాటాల గడ్డ అన్నారు.  కేసీఆర్‌ ఇటీవల మధిరలో సభ పెట్టి ఇక్కడ భట్టి విక్రమార్క గెలవడని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క కేసీఆర్‌ కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరన్నారు.  మధిరలో 50 వేల మెజార్టీతో గెలుస్తా… కేసీఆర్‌, కేటీఆర్‌ ఉడత ఊపులకు మధిర ప్రజలు భయపడరని దీటుగా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలందరికీ ఇండ్లు, ఉద్యోగాలు, ఇంటి స్థలాలు, నీళ్లు వస్తాయని ఆశపడ్డాం! కానీ 10 సంవత్సరాలుగా ప్రజల సంపదను బిఆర్ఎస్ పాలకులు ప్రజలకు దక్కకుండా పందికొక్కుల్లాగా తిని అన్యాయం చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో దొరలు ఓడి ప్రజలు గెలవాలన్నారు. ప్రజల సంపదను దోపిడీ చేస్తున్న దొరల ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచి, ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి ప్రభంజనంలాగా వీస్తున్నదని, 78 నుండి 84 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుస్తున్నారన్నారు. మధిర నియోజకవర్గం ప్రజలు ఈ రాష్ట్రానికి దశా దిశా దిక్సూచిగా నిలిచి రాబోయే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే వ్యక్తిని, వేసిన ఓటుకు విలువ తీసుకొచ్చే వారిని ఎన్నుకుంటారన్నారు. మధిర ప్రజలు వేసే ఓటు ఈ రాష్ట్రానికి ఉద్యోగం ఇచ్చేదిగా ఉండాలని, రైతులకు మద్దతు ధర నిర్ణయించేదిగా ఉండాలన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ఈ పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆరు గ్యారెంటీ ల హామీలను తీసుకువచ్చామని వివరించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్‌కే ఓటాయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధికారం వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. పేదలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు. మధిరలో గెలిచే వ్యక్తి ప్రశ్నించేవాడైనా ఉండాలి… పరిపాలించే వాడేనా ఉండాలన్నారు. అటు ఇటు కాని వ్యక్తికి ఓటు వేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. టిడిపి, సీపీఐ, వైఎస్ఆర్ టిపి మద్దతుతో మధిర అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *