విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం
– రూ.౩ లక్షల ఆస్తి నష్టం
చర్ల, శోధన న్యూస్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ పూరిల్లు దగ్ధమై మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది.మండల పరిధిలోని కలివేరు గ్రామం,రజబ్ అలీ కాలనీకి చెందిన భూటారి జోగయ్య తన భార్యతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉదయం 11:30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇల్లు తగలబడుతుండగా గమనించిన స్థానికులు, పక్కనే ఉన్న సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.151 బెటాలియన్ కి చెందిన సిఆర్పిఎఫ్ సిబ్బంది తన క్యాంపు నుండి నీళ్ల ట్యాంకర్లు తెచ్చి మంటలను అదుపు చేస్తుండగానే పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది.ఫైర్ ఇంజన్ అందుబాటులో లేని కారణంగా అందరూ చూస్తుండగానే పూరిల్లు దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. మూడు క్వింటాళ్ల పత్తి,పది బస్తాల ధాన్యం, 50 వేల రూపాయల నగదు పూర్తిగా దగ్ధమైంది.వాటితో పాటుగా పలు డాక్యుమెంట్లు మంటలలో కాలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ యజమాని, తన భార్య కలిసి బోరున విలపిస్తూ తమ ఇంటి వద్దకు చేరుకొని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.ఇంటి యజమాని భూటారి జోగయ్య, అతని భార్య నానమ్మ బోరున విలపిస్తూ తాము కూలినాలి చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో కొంత పత్తి వ్యవసాయం,వరి వ్యవసాయం చేసి వచ్చిన ధాన్యము,పత్తిని అమ్మకం జరపడం కోసం ఇంటి వద్దనే ఉంచుకున్నామని,విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం దయజేసి తమను ఆదుకోవాలని కన్నీరు మున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.