వైభవంగా మహా పడిపూజ…అయ్యప్ప శరణు గోష తో మారుమోగిన ప్రాంగణం
వైభవంగా మహా పడిపూజ.
-అయ్యప్ప శరణు గోష తో మారుమోగిన పడి పూజ ప్రాంగణం
-పడిపూజకు వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప మాలదారులు, భక్తజనం
– కేరళ నంబూద్రి గురువుచే తాంత్రిక పూజ
పినపాక, శోధన న్యూస్ : మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయితీలోని పోతురెడ్డి పల్లి గ్రామంలో నర్సులు గురుస్వామి అయ్యప్పపీఠం ఆధ్వర్యంలో బుధవారం నాడు మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే విధంగా అయ్యప్పకు సంబంధించిన ఆలయ ఆకృతులను ఏర్పాటు, పాల్వంచకు చెందిన కేరళ మాధవన్ నంబూద్రి గురువు చేత మండలంలో ఎన్నడూ లేని విధంగా తాంత్రిక పూజ, కలశ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప మహా పడిపూజను తిలకించేందుకు పినపాక, కరకగూడెం మండలాలలోని పలు ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలదారులు భారీ సంఖ్యలో విచ్చేశారు. చుట్టు ప్రక్కల ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పడిపూజ ప్రారంభం నుండి అయ్యప్ప గానామృతాన్ని సాంబయ్య గురుస్వామి, సిద్దెల హుస్సేన్ పలువురు గురుస్వాములు ఆలపించారు. వేదమంత్రాల నడుమ మాధవన్ నంబుద్రి గురువు చేసిన తాంత్రిక పూజ అద్భుతమైన అనుభూతినిచ్చిందని అయ్యప్ప మాలధారులు, భక్తులు చర్చించుకున్నారు. మండలంలో ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే విధంగా మహా పడిపూజను నిర్వహించడం సంతోషంగా ఉందని భక్తజనం అంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిల్లా నాగేంద్రబాబు ప్రధాన కార్యదర్శి సనప భారత్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.