శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు
శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు
అశ్వారావుపేట, శోధన న్యూస్ : నూతన ఆంగ్ల సంవత్సరాదితోపాటుగా శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన సోమవారం కావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలలోని శివాలయాలు తెల్లవారుజామునుండే భక్త జనంతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం, వడ్లగూడెంలోని శివాలయం, దమ్మపేట లోని అత్యంత పురాతన శివాలయం, అశ్వరావుపేట లోని కోనేరు బజారు నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం, వినాయకపురంలోని శ్రీ కాళేశ్వర స్వామి ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అంతరాలయంగా ఉన్న శివాలయంలో, మామిళ్ల వారి గూడెం లోని శివాలయములలో భక్తులు తెల్లవారుజామునుండే స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునుండే స్వామికి వివిధ రకాల పండ్లు పండ్ల రసాలు విభూది కుంకుమ చందన అభిషేకాలను వేదపండితుల పూజల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట పట్టణంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వందలాది మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చల్లా ఏసు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.