శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా ఉపముఖ్యమంత్రి భట్టి దంపతులు
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా ఉపముఖ్యమంత్రి భట్టి దంపతులు
మధిర, శోధన న్యూస్ : కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం దర్శించుకున్నారు. భట్టి తన సతీమణి నందిని, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్యతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో భట్టి విక్రమార్క కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను, 2024 టీటీడీ డైరీ, క్యాలెండర్ ను అందజేశారు. ఆలయం వెలుపల భట్టి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన, అద్భుతమైన తీర్పు ఇచ్చారని, తాను నిర్వర్తించే ఆర్థిక శాఖలో ఆర్థిక వనరులు అభివృద్ధి చెందేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు.