సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా కొనసాగించాలి
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా కొనసాగించాలి
–జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెక్ పోస్టుల్లో పటిష్ట నిఘా, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాలపై ఎలాంటి వ్యత్యాసాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా ఎన్నికల నియమ, నిబంధనలు పాటించాలని అన్నారు.నియోజకవర్గాలలోని ప్రతి పోలింగ్ స్టేషన్లో వికలాంగులకు త్రాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ర్యాంపులు వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సౌకర్యాలు కల్పనలో ఎక్కడైనా లోపాలుంటే తక్షణమే అట్టి పోలింగ్ కేంద్రాల్లో 10 రోజుల లోపు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు, అంతర్రాష్ట్ర సరిహద్దులలోని ఏర్పాటు చేసిన బృందాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం, నగదు, మాదకద్రవ్యాల రవాణాను తనిఖీ చేయాలన్నారు.
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తరచూ సందర్శించాలని, ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే వెంటనే సంబంధిత ఆర్వో లేదా జిల్లా ఎన్నికల అధికారికి తెలియచేయాలనిఅన్నారు. ప్రతి ఆర్వో కార్యాలయంలో పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, వచ్చిన ఫిర్యాదులుపై ఎన్నికల నియమ నిబంధనలు ప్రకారం తగు చర్యలు తీసుకోవాలనితెలిపారు.పటిష్ట పర్యవేక్షణ చేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


